సాధారణంగా పిల్లలు మూడు నాలుగు సంవత్సరాల వయస్సు నుండీ కథలు చెప్పమని అడుగుతుంటారు. పిల్లల ఎదుగుదలలో ఈ కథల మీద ఆసక్తి ఒక సహజమైన భాగం. ప్రకృతే ఏర్పరచింది అందరు పిల్లలకూ అలా. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఈ భాష వాళ్లు ఆ భాష వాళ్లు అని లేదు, పల్లెటూరి వాళ్లు పట్నం వాళ్లు అని లేదు, పేదలు ధనికులు అని లేదు, ఇండియా అమెరికా అని లేదు, ఆడా మగా అనీ లేదు, పాత కాలం ఈ కాలం అనీ లేదు. కథల పట్ల పిల్లలకు ఆసక్తి సార్వజనీనమున్నూ, సార్వత్రికమున్నూ.
ఒకటి, రెండు, మూడు సంవత్సరాల వయసులో మనం పిల్లలతో మాట్లాడం ద్వారా వాళ్లు మాటలు నేర్చుకుంటారు. తరువాతి దశలో, అంటే నాలుగు, ఐదు సంవత్సరాల వయసునుండీ, ఈ కథల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటారు. వ్యక్తిత్వాలు, సంబంధ బాంధవ్యాలు, కుటుంబాలు, కష్టసుఖాలు, ధైర్యసాహసాలు, సంస్కృతి, చరిత్ర ఇలాంటివి ఎన్నో, వాళ్లు కథల ద్వారానే నేర్చుకుంటారు. ఈ కథల ద్వారా వాళ్లు ఎన్నో ఊహా లోకాలు నిర్మించుకుంటారు. భావినిగూర్చి వారు కనే కలలకు ఇవి ప్రేరకాలు. భవిష్యత్తులో వాళ్లు సాధించాలనుకునే వాటికి పునాదులు.
కథలో ఒక పాత్ర ఇంకో పాత్రకు అన్యాయం చేస్తే, పెద్దయినతరువాత అలాంటి అన్యాయపరులను మట్టుపెట్టాలనే ప్రేరణ కలుగుతుంది వారికి. అలానే తల్లి దండ్రులను ప్రేమగా చూచుకునే పిల్లల కథలు, పిల్లలను లాలించే తల్లిదండ్రుల కథలూ, వాళ్ల భవిష్యత్తులో వారు అలానే చేయాలనే ప్రేరణను కలుగ చేస్తాయి. అలాగే ఓర్పు, దయ, క్షమ, కృషి, బాధ్యత, సంఘీభావము, సహకారమూ, శరణు కోరడమూ, శరణు ఇవ్వడమూ, ప్రకృతితో మమేకం అవడమూ, ప్రకృతిని రక్షించుకోవడమూ లాంటి ఎన్నో భావాలకూ ఆశయాలకూ, కథలోని పాత్రలూ సన్నివేశాలు ఆలంబనం, ఉత్ప్రేరకం అవుతాయి.
రెండు మూడు తరాల క్రితం వరకూ పిల్లలకు కథలు పెద్దల ద్వారానే తెలిసేవి. కొంచెం చీకటి పడగానే అన్నాలు తినేసి, మంచం ఎక్కేసో, వెన్నెల్లో కూర్చునో కథలు సాగేవి. ఈ ఆధునిక యుగంలో ఇదంతా మారిపోయింది. కథల పట్ల ఆసక్తి ప్రకృతి సహజం కనుక అది ఇంకా ఉందికాని, ఆ కథలు వాళ్లకు అందే విధానంలో మార్పు చోటు చేసుకుంది. వీడియోలు, పుస్తకాలు కధలకు ఆధారం అవుతున్నాయి పిల్లలకు ఈ రోజుల్లో.
కాని ఈ ప్రక్రియలలో మూడు లోపాలున్నాయి. ఒకటి, వీడియో చూస్తున్నప్పుడు కాని, పుస్తకం చదువుతున్నప్పుడు కాని వాళ్లకు వచ్చే సందేహాలకు సమాధానం చెప్పేందుకు ఎవరూ ఉండరు. వాళ్లకు వాళ్లే ఏదో చెప్పుకుంటారు. తామనుకున్నదే సరియైనది (self-righteousness) అనుకోవడానికి ఇక్కడే బీజాలు పడతాయి. ఇక రెండోది. కథ విన్నప్పుడు పిల్లల ఊహలు పురి విప్పుతాయి. వాటికి ఎల్లలు ఉండవు. ఒక్కో బిడ్డ ఒక్కోరకంగా ఊహిస్తాడు వర్ణింప బడే దృశ్యాన్ని. ఉదాహరణకు ఆమడ పొడవున్న కబంధుడి చేతుల్ని కాని, హనుమంతుడు తోకకు నిప్పంటించినప్పుడు లంకను కాల్చడం కాని, పది తలల రావణాసురుణ్ణి కాని ప్రతి పిల్ల, పిల్లవాడు, తనదైన శైలిలో ఊహిస్తారు. ఆ ఊహ ఎవరికి వారికే స్వంతం. అదే వీడియో చూచినప్పుడు పిల్లలు చిత్రకారుడి ఊహను మాత్రమే చూస్తారు. తమకు తాముగా ఊహించుకునే అవకాశాన్ని కోల్పోతారు.
ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది. వీడియోల ద్వారా, పుస్తకాల ద్వారా కథలతో బంధం ఏర్పడుతుంది కాని, మనుషులతో సంబంధం ఏర్పడదు. పుస్తకాలు, వీడియోలు నిర్జీవ మాధ్యమాలు, సజీవ మాధ్యమాలు కావు. అవి మనిషనీ కథను కలపగలవు కాని, మనిషినీ మనిషినీ కలుపలేవు. వీడియో చేసేవాడి లేదా పుస్తకం వ్రాసే వాడి మానసిక, సామాజిక పరిస్థితులకూ, చూసే లేదా చదివే వాడి మానసిక, సామాజిక పరిస్థతులకు సంబంధం ఉండదు. అందువల్ల వాళ్లిద్దరి మధ్య ఒక సజీవ సంబంధం (ఆర్గానిక్ కనెక్షన్) ఉండదు.
వీడియోలు, పుస్తకాల ద్వారా కథలు తెలుసుకోని పెరిగిన తరాన్ని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వీళ్లకు విషయ పరిజ్ఞానం బహుళం. కాని ప్రక్కవారితో మాట్లాడం మాత్రం చేతకాదు. ఎన్నో నీతులు, ప్రపంచ స్థాయి విషయాలు మాట్లాడే వాళ్లు కూడా పక్క వాళ్లతో కష్ట సుఖాలు, సాధక బాధకాలు ఎలా పంచుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఊరికూరికినే ప్రతివారి మధ్యన ప్రతివిషయంలో అభిప్రాయ భేదాలు. ఒకరు చెప్పేది ఒకరు వినరు. ఒకరు చెప్పేది ఇంకొకరు అర్థం చేసుకోలేరు. విషయాల్ని పంచుకోవడం తగ్గి, వాదించుకోవడం, విభేదించడం ఎక్కువ అయిపోతున్నది. అదే అభిప్రాయభేదాలు భార్యాభర్తల మధ్య వస్తే ఫలితం చెప్పనవసరం లేదు. విడాకుల దాకా వెళ్లినా ఆశ్చర్యపడనవసరం లేదు. రెండు మూడు తరాల క్రితం వరకూ పెద్దవాళ్ల ద్వారా కథలు విన్న కాలంలో పిల్లలలో కంటే, ఈ కాలం పిల్లలలో మానసిక ఎదుగుదల లోపాలు కనిపిస్తున్నాయి. పెద్దల ద్వారా కథలు విని పెరిగిన పిల్లలకూ, వినకుండా పెరిగిన పిల్లలకూ ఉండే వ్యత్యాసాన్ని మానసిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారో లేదో తెలియదు కాని, చెయ్యడం చాలా అవసరం.
పిల్లలకు కథలు చెప్పక పోవడం అంటే వాళ్లను తీర్చిదిద్దేందుకు ఉన్న ఒక మహత్తర సాధనాన్ని జారవిడుచుకోవడమే. పిల్లలకు ధైర్యం కరాటే క్లాసుల్లోంచి రాదు. ఒక ధైర్యవంతుడి కథను, తల్లో, తండ్రో, తాతో, అమ్మమ్మో, నాయనమ్మో, అనుభూతితో చెబితే విన్నప్పుడు వస్తుంది. అయితే ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు అందులో తలమునకలై పోయి పిల్లలకు కథలు చెప్పడం మాట అటుంచి, సరిగ్గా మాట్లాడేందుకు కూడ సమయం దొరకని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఉన్నకాస్త సమయం కూడా, పిల్లల చేత హోం వర్క్, గట్రా చేయించడంతో సరిపోతున్నది. రేపు పొద్దున్న వాళ్లు పెద్దవాళ్లై యౌవనంలోకి అడుగు పెట్టిన తరువాత పిల్లలూ, తల్లిదండ్రులూ ఎలా మాట్లాడు కోవాలో తెలియని స్థితి. అంటే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. వాళ్ల పెళ్లిళ్ల విషయాల్లో కాని, అవి సరిగ్గా నడవడం విషయంలో కాని పెద్దల ప్రసక్తి ఉండదు. ఏదైనా తేడాలు ఇబ్బందులో వస్తే తల్లిదండ్రులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేని స్థితి. అనేక కుటుంబాలల్లో, జీవితాల్లో ఇదే గొడవ. జాతకాలు అన్నీ చూసి, అంగరంగ వైభవంగా జరిపిన పెళ్లిళ్లు కూడా తుమ్మితే ఊడే ముక్కు పరిస్థితిలో ఉంటున్నాయి.
కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి. కొందరు తల్లి దండ్రులు పిల్లలతో చాలా స్నేహపూర్వకం (ఫ్రండ్లీ) గానే ఉంటారు. అయినా పిల్లలు, వారి పైచదువుల నిర్ణయాలలోగాని, ఉద్యోగ నిర్ణయాలలో కానీ, వివాహ నిర్ణయంలో కానీ పెద్దల్ని దూరంగానే ఉంచుతున్నారు. కారణం ఇదే. రోజూ జరిగే మామూలు విషయాలు, లోకాభిరామాయణం ఎలా మాట్లాడుకోవాలో వారికి తెలుసుకాని, జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎలా చర్చించుకోవాలి అన్నది వారికి తెలియదు. అలాంటి ముఖ్యమైన విషయాల గురించి చిన్నతనంలోనే పిల్లలకు చెప్పాలంటే కథలే మార్గం. మూడు నాలుగు సంవత్సరాల వయస్సులో పిల్లలు వాళ్లంతట వాళ్లే వచ్చి అడిగినా, వాటిని చెప్పే అవకాశాన్ని తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, బామ్మలు జారవిడుచుకోవడం కూడని పని.
అయితే ఏ కథ చెప్పాలి? ఏవి మంచివి? ఏవి బాగా ఉపయోగపడతాయి? ఈ విషయంలో భారతీయులమైన మనం చాలా అదృష్టవంతులం. చిన్న చిన్న కాకి పిచ్చుక కధల దగ్గర్నుంచీ, చీమచిలక పరమాన్నం వండుకున్నాయి లాంటి కథల నుంచీ, పంచతంత్రం కథల నుండీ, రామాయణ, భారత, భాగవతాల దాకా అనేక కథలు మన వారసత్వంలో భాగం. మూడు నాలుగేళ్ల పిల్లలకు తమాషా (సిల్లీ) కథలంటే ఇష్టం. నాలుగైదు ఏళ్లు వచ్చేసరికి జీవితాన్ని గురించి చెప్పే కథలు, అంటే రామాయణ, భారతాలలాంటి వాటికి కూడా వాళ్లు మానసికంగా రెడీ. అవివాళ్లకు చెప్పాలి. అందులో ప్రధానమైన కధలతో పాటు చాల చిన్న కథలు కూడా వస్తాయి. ప్రతి కథలో ఏదో ఆసక్తి కరమైన విషయం, అద్భుతమైన పాత్రలు, సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ మధ్య చాలా మంది తల్లి దండ్రులకు, తాత, అమ్మమ్మలకు కూడా రామాయణ భారతాలు చాలా సంగ్రహంగా తప్పితే, వాటిలో విశేషాలు తెలియడం లేదు. అందులో సన్నివేశాల గురించీ, సంభాషణల గురించీ జ్ఞానం అసలు ఉండటం లేదనే చెప్పాలి. ఈ మధ్య మత మార్పిడులూ, మత విద్వేషాలూ పెరిగి, ఈ వారసత్వ ఇతిహాస సంపద అయిన రామాయణ భారతాల మీద, ఇటు కొందరు మితిమించిన దురభిమానాన్నీ, అటు కొందరు అకారణమైన ద్వేషాన్నీ పెంచుకుంటున్నారు. ఈ వెఱ్ఱి విపరీతంగా పెరిగి, రామాయణ భారతాల ఊసెత్తడమే కష్టంగా ఉంది కొంత మంది దగ్గర.
రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది సరే. తనతో పాటు వస్తానని సీత ఎందుకన్నది, ఎలా అన్నది? రాముడు దానికి బదులు ఏమన్నాడు? భర్తకు ఊహించరాని, చెప్పరాని కష్టం వచ్చినప్పుడు, మనో నిబ్బరం, భర్తమీద అనురాగం ఉన్న భార్య ఎలా స్పందిస్తుంది? ఇలాంటి జీవితాంశాల్ని తెలియజెప్పే అవకాశాల్ని, మనకు తెలియకుండానే కాలరాస్తూ రోజులు గడిపేస్తున్నాం.
కథలు చెప్పకపోవడమంటే, పిల్లల్ని పెంచే క్రమంలో చేయవలసిన దానిలో ఒక ముఖ్యమైన భాగం చేయకుండా మన బాధ్యతనుండీ మనం తప్పుకోవడమే. ఈ పరిస్థితిని సరిదిద్దడానికే ఈ రీడ్ రామాయణ అనే చిన్న ప్రయత్నం. లేదా బృహత్ప్రయత్నం. ఎలా అనుకున్నా సరే. రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంధం. ఉత్తర కాండ తీసివేస్తే ఇరవై వేల శ్లోకాలు. రోజుకు వంద శ్లోకాలు చదివితే రెండువందల రోజులు, అంటేసుమారుగా ఏడు నెలలు పడుతుంది. కాని అంత తొందరగా చదవక్కర లేదు. మెల్లి మెల్లి గా ఆస్వాదిస్తూ చదివితే బాగుంటుంది. రోజూ బదులు, వారానికి ఒక రోజున వంద శ్లోకాలు చదివితే చాలు. అలా చేస్తే, రెండువందల వారాలు, అంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ రోజుల్లో వచ్చే టీవీ సీరియల్స్ లాగా. మీరు చదవడం మొదలు పెట్టిన తరువాత మీకే తెలుస్తుంది, అసలు రామాయణం మానవ జాతి కనిపెట్టిన మొదటి సీరియల్ అని. ప్రతి సర్గలో కధ ఎక్కువగా ఏమీ నడవదు. వివరం ఉంటుంది. అందులో విశేషం ఉంటుంది. అది ఆస్వాదించడంలో ఆనందం ఉంటుంది. ఇలా నాలుగు సంవత్సరాలు వాల్మీకి రామాయణాన్ని ఈ కొస నుండీ ఆ కొస వరకూ చదవడానికి వీలుగా రూపొందించిందే రీడ్ రామాయణ కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో భాగంగా మీరు మీ పిల్లలకు గాని, మనవలు, మనవరాళ్లకు కాని, రామాయణం ప్రతి వారం కొద్ది కొద్దిగా చదివి వినిపించాలి. పిల్లలకు నాలుగైదు సంవత్సరాల వయస్సులో మొదలు పెడితే, వాళ్లకు తొమ్మిది పది సంవత్సరాలు వచ్చే సరికి పూర్తి అవుతుంది. ఈ వయస్సులో వాళ్లు కథలు వింటానికి చాలా చాలా ఇష్ట పడతారు. వాళ్ల మనసుల్లో జీవితం అనే దానికి ఒక ఆకృతి ఏర్పడేది ఈ వయసులోనే. ఒకసారి మొదలు పెట్టి అలవాటయితే, వాళ్లకు వాళ్లే, ప్రతివారం కథ కోసం ఎదురు చూస్తారు. మొదలు పెట్టినప్పుడు వారం వారం చదవడం కొంచెం కష్టం అనిపించవచ్చు. రెండు నెలల పాటు క్రమశిక్షణతో చదివితే ఆ తరువాత అదే అలవాటయిపోతుంది.
ప్రతి వారం మీరు చదివి వినిపించనూ వచ్చు, లేదా ముందుగానే మీరు చదువుకోని, మీ స్వంత మాటల్లో వారికి చెప్పనూ వచ్చు. కథ వింటూ వాళ్లు వేసే అమాయకపు ప్రశ్నలూ, చేసే ఎల్లలు లేని ఊహలూ వింటుంటే మీకే అంతులేని, వెలకట్టలేని, ఆనందం కలుగుతుంది. ఆ అనుభవాలు మీకూ వాళ్లకూ కూడా జీవితాంతం తీపి గురుతులుగా మిగిలి ఉంటాయి. ప్రతివారం కథ చదువుకొనే సందర్భంలో మీ మధ్యనున్న అనుబంధం కొత్త చిగుళ్లు వేస్తుంది. గిర్రున తిరిగి పోయే కాలచక్రంలో చెరిగి పోని అందమైన గీతలుగా ఈ రామాయణం కథ చెబుతున్న నాలుగైదు సంవత్సరాలూ నిలబడి ఉంటాయి. జీవితంలో తరువాత తరువాత వచ్చే చాలా ఒడుదుడుకులను తట్టుకునేందుకు క్రింద చెక్కు చెదరని పునాది లాగా మీ మధ్య ఏర్పడిన బలమైన బంధం పనిచేస్తుంది. వాళ్లు పెద్దవాళ్లయిన తరువాత మీకూ వాళ్లకూ అభి ప్రాయ భేదాలు రావచ్చు. కాని వాటికి వీగి పోకుండా, తట్టుకొని నిలబడేందుకు మీ మధ్య ఏర్పడిన బంధం సహాయపడుతుంది. ఏ సైకలాజికల్ కౌన్సెలర్ దగ్గరకూ వెళ్లవలసిన అవసరం ఉండదు.
ఈ మధ్య విదేశాల్లో ఉన్న పిల్లల్ని చూడటానికి, మనవలు మనవరాళ్ల తో కాలం గడపటానికి పెద్దవాళ్లు వెళ్లి నాలుగేసి, ఐదేసి నెలలు వాళ్లతో గడపటం సర్వ సాధారణమైంది. అది ఈ రామాయణాన్ని వాళ్లకు చదివి వినిపించడానికి ఒక మహత్తర అవకాశం. మళ్లీ విదేశాలనుండీ తిరిగి వచ్చినతరువాత కూడా వీడియో కాల్స్ ద్వారా వారం వారం రామాయణం చదివే కార్యక్రమాన్ని కొన సాగించవచ్చు. ఈ చదివే సందర్భాన్ని అదునుగా తీసుకొని పిల్లలకు అనేక రకమైన సంస్కృతీ పరమైన విషయాలు, కుటుంబపు కట్టుబాట్ల లాంటివి ఎన్నో వాళ్లతో పంచుకోవచ్చు. విడిగా ఇవి చెప్పాలన్నా కుదరదు. చెబుదామనుకున్నా పిల్లలు 'బోర్' అంటారు. అదే కథ చెబుతున్న సమయంలో నైతే, ఏన్నో చర్చకు వస్తాయి. అన్నింటిని గురించి మాట్లాడుకోవచ్చు. పిల్లలు సాధారణంగా తండ్రికంటే తల్లి దగ్గర, తల్లికంటే తాత, అమ్మమ్మల దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది. ఆ చనువును వృధా చేసుకోకుండా రామాయణాన్ని తరాల వారధిగా చేసుకోని, వారితో మీ మనసుని పంచుకుని, వారి మనసును వారు మీతో పంచకునే అవకాశం కల్పించడం కంటే, మీరు వారికి ఇవ్వగలిగిన మరో విలువైన వస్తువు ప్రపంచంలో మరొకటి ఉండదు.
ఇప్పుడు ఈ వారం వారం రామాయణ చదివే కార్యక్రమం ఎలా మొదలు పెట్టలా లో అన్న వివరాలు చూద్దాం. ముందుగా మీరు www.readramayana.org కు వెళ్లి, అక్కడ మీ email id ఇస్తారు. వెంటనే మీకు మీ email లో sign-up form వస్తుంది. దాంట్లో మీరు మీ వివరాలు ఇస్తారు. అందులో ఒకటి మీకు ఏలిపిలో శ్లోకాలు కావాలి అన్నది. తెలుగు లిపి లోనా, రోమన్ లిపి లోనా, దేవనాగరి లోనా, ఇంకా కన్నడ, మళయాళం, తమిళం, గుజరాతీ, ఒరియా, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, నేపాలీ లాంటి ఎ భాషలో నైనా సరే. అలాగే మీరు చదవడం ఎప్పుడు మొదలు పెడదామనుకుంటున్నారు? వచ్చే శ్రీరామ నవమినుండా? లేదంటే పిల్ల లేదా పిల్లవాడి ఐదవ పుట్టిన రోజు నాడా? లేదా ఇంకా ఏదన్నా శుభ ముహూర్తానా? ఇలా మీకు కావాల్సన తేదీని అందులో ఇవ్వవచ్చు. అలాగే మీ జండర్, పుట్టిన సంవత్సరం, మీరు నివసిస్తున్న దేశంలాంటి చిన్న వివరాలు కూడా ఇవ్వ వచ్చు. ఈ వివరాలు ఎక్కడు నుండి ఏ వయసు వారు చదువుతున్నారు అని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఒకసారి మీరు ఈ వివరాలన్నీ ఇచ్చిన తరువాత, మీరు ఎంచుకున్న తేదీనుండీ మీకు రామాయణం email లో వస్తుంది, ప్రతి శనివారం. బాలకాండ నుండీ మొదలు పెట్టి ఒకటి లేదా రెండు లేదా మూడు సర్గలు, సుమారుగా వంద శ్లోకాలు ఉండేట్లు వస్తాయి. శ్లోకం మీరు ఎంచుకున్న లిపిలోనూ, తాత్పర్యం ఆంగ్లంలోనూ వస్తాయి. శ్లోకాలకు సంబంధించిన విశేషాలు ఏమన్నా ఉంటే, ప్రక్కన ఇవ్వబడతాయి.
త్వరలో వేద పండితులు గానం చేసిన ఆడియో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం లో ఉన్నాం. ఉత్తరోత్రా తాత్పర్యం ఆంగ్లంతో పాటు మిగిలిన భారతీయ, అంతర్జాతీయ భాషల్లో కూడా తేవాలని ఆశ పడుతున్నాం.
రీడ్ రామాయణ పూర్తిగా ఉచితం. వృత్తి రీత్యా శరీరం, మెదడు అమెరికాలో ఉంటున్నా, హృదయాన్ని మాత్రం జన్మ భూమి అయిన భారతదేశంలోనే వదిలి వెళ్లిన శ్రీ ధూళిపాళ్ల కృష్ణశర్మగారి ఆధ్వర్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది స్వచ్ఛంద సేవకుల సహకారంతో, ఈ కార్య క్రమం నడుపబడుతున్నది.
ఇప్పటివరకు తొమ్మిదివేలమంది పైచిలుకు ఈ కార్యక్రమం ద్వారా వారి పిల్లలకు రామాయణం చదివి వినిపించడం జరుగుతున్నది. ఇంకా కొన్ని వేల, కాదు, లక్షల మంది ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, రామాయణాన్ని తరాల వారధి గా చేసుకుంటారన్న ఆశతో - ప్రణామాలు.
www.readramayana.org దర్శించండి. మిగిలిన వివరాలు తెలుసుకోండి.